Wednesday, March 29, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-23
'యే మాలిక్ తేరే బందె హమ్'  13 January
(“ప్రభూ ! మేము నీచే సృష్టింపబడ్డ మనుషులం)
...
ప్రార్ధనల్లో చాలాభాగం తనకోసమో తనవాళ్ళకోసమో చేసేవి ఎక్కువ.అలా కాక వేరేవారికోసం అమిత దుఃఖంతో జాలిని మించిన భావోద్వేగాలతో దేవుణ్ణి ప్రార్ధించడం ఉన్నతమైన విషయం.అలా ఎవరికోసం ప్రార్ధిస్తున్నారో వాళ్ళు చాలా ప్రభావశీలురై ఉండాలి.

మాదైవం సినిమా వచ్చింది.అందులో నాయకుడైన జైలరు,ఆరుగురు ఖైదీలను మారుమూల నిరుపయోగంగా ఉన్నవ్యవసాయక్షేత్రానికి తీసుకెళతాడు. బంధనాలు లేని బందిఖానా. వాళ్ళలో పరివర్తన తేవటం, వారు తిరిగి మామూలు మనుషులవటానికి మరోఅవకాశం ఇవ్వటం ఆ ప్రయోగ అంతరార్ధం.ఆ ప్రయోగంలో జైలరు సఫలుడవ్వటం సినిమా కథ. బడిపంతులు నుండిఅడవిరాముడుగా ఎన్.టి.ఆర్ మారుతున్న క్రమంలో వచ్చిన సినిమా.సినిమా చూడటమే సంబరమైన రోజుల్లో ఆ సినిమానచ్చకపోవటానికేమీ లేదు.
తర్వాత రోజుల్లో ఆ సినిమా మాతృక 'దో ఆంఖే బారా హాత్ ' సినిమా చూసాను. ఒక మనిషి కంటిచూపులు ఆరుగురు ఆరుబయల్లో ఉన్నఖైదీలను కనపడని కటకటాల్లా బంధించివుంచాయి.
ఆ చిత్రం ఎల్లెడలా కనిపించేది గాంధీ తత్వం(గాంధియన్ థాట్). అహింస, పరివర్తన, మరో అవకాశం,నైతిక విలువలను అధారం చేసుకునిఒక ప్రయోగం.(గాంధీ ఆత్మకథ కూడా’ నిజాలతో ప్రయోగాలే’).దర్శకుడు,కథానాయకుడు వి.శాంతారామ్ 'నవ్ రంగ్' వంటిరంగులసినిమా తీసి తర్వాత కావాలని దీనిని నలుపు తెలుపు చిత్రంగా తీశాడు. చిత్రం చూస్తున్నంతసేపూ సూక్ష్మవివరాలతో చెక్కినశిల్పాన్ని చూసినట్టువుంటుంది.కథానాయకుడ్ని చూస్తే మనస్పూర్తిగా నమ్మి అంతరంగాన్ని చెప్పుగోదగినంత గొప్పవ్యక్తిగా కనిపిస్తాడు.అహింస దుర్బలుల లేదా భయస్తులకు చెందిందికాదు అన్నదానికి నిర్వచనంలా ఉంటాడు. ఆరుగురు నేరస్తుల క్రమానుగతపరివర్తనకు తన ఉన్నత మానవ విలువలతో కారణమయ్యాడు.దీనికి అతని పెట్టుబడి నమ్మకం.అతని నమ్మకం వమ్ము ఐనసందర్భాలలో అతనికి వచ్చేది కోపంకాదు..బాధ.
అలాంటి వ్యక్తి చావుబ్రతుకుల్లో ఉన్నపుడు అతనితో బ్రతుకు పంచుకోవాలనుకున్న స్త్రీ, అతనివల్ల మారినఆరుగురు ఖైదీలతో కలిసిఅతని బాగుకోసం చేసే ప్రార్ధన.
“ప్రభూ ! మేము నీచే సృష్టింపబడ్డ మనుషులం
మేము చేసే పనులన్నీ నీవే
మంచి మార్గం లో నడుపు,చెడు కి దూరంగా ఉంచు. నవ్వుతూనే ఊపిరి వదులేట్టు వుంచు.
ఇప్పుడు చిమ్మచీకటి కమ్ముకుంది.నీమనుషులం గాభరా పడుతున్నాం
పలుకేమీ వినరాదు,కంటికేమీ కానరాదు..సుఖ కారకుడైన సూర్యుడు చాటుకు వెళ్ళిపోతున్నాడు.
నీ వెలుతురు అమావాస్య ను పున్నమి చేసేంత శక్తి కలిగింది
మనుషులు బహు బలహీనులు.వారి లోపాలు లక్షలు
దయాళూ నీ కృపతోనే ఈ ధరాతలం చరిస్తుంది
మాకు నువ్వు జన్మ నిచ్చినందుకు , మా బాధలకూ నీదే బాధ్యత
అన్యాయం ఎదురైనపుడు నువ్వే మాకు అండ
వాళ్ళు కీడు ఛేసినా, ప్రేమతో నింపి ప్రతీకార వాంఛ లేకుండాచేయి
ప్రతి అడుగు ప్రేమకోసమే నడుపు.శతృత్వపు తలపుల్ని నివారించు.”
(భరత్ వ్యాస్ రాసిన గీతం, వసంత్ దేశాయ్ సంగీతం, లతా గానం)
-ముళ్ళపూడి సుబ్బారావు

No comments:

Post a Comment